Friday, July 25, 2014

ముఖాన స్కార్ఫ్ లేకుండా బండి ఎక్కినందుకు అమ్మాయికి జరిమానా

న్యూస్ డెస్క్, హైదరాబాద్ :

ముఖాన స్కార్ఫ్ లేకుండా బండి ఎక్కినందుకు, ఒక అమ్మాయికి 5000 జరిమానా వేసిన సంగతి హైదరాబాదులో చోటు చేసుకుంది. మాదాపూర్ లోని ఒక ఐటి కంపెనీలో పని చేస్తున్న దీపక్, తన స్నేహితురాలు సరోజతో కలిసి, బంజారా హిల్స్ లోని సినీ మాక్స్  సినిమా థియేటర్ లో "సగం కాలిన శవం" అనే దయ్యం సినిమాకి వెళ్ళాలని బయలు దేరాడు.  

మాదాపూర్ నుండి వస్తూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు దాటగానే, పోలీసులు వాహనాలన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. దీపక్ ను సైతం ఆపారు. 


దీపక్ తన బండిని పక్కకు ఆపి, హెల్మెట్ తీసి, తన జేబులో ఉన్న బండి సి బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ అన్నీ తీసి పోలీసు చేతికి అందించాడు. ట్రాఫిక్ కానిష్టేబుల్ వాటిని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాడు. 5000 రూపాయలు జరిమానా విదిస్తూ చలానా రాసి దీపక్ చేతికి ఇచ్చాడు. ఖంగు తిన్న దీపక్ తేరుకొని, "నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, హెల్మెట్ తో సహా,  5000 రూపాయలు ఎందుకు" అని ప్రశ్నించాడు. దీపక్ వెనుక కూర్చున్న సరోజ ముఖాన స్కార్ఫ్ లేనందుకు ఆ 5000 జరిమానా విదిస్తున్నట్టు తెలియజేశాడు. చేసేది లేక 5000 కట్టి అక్కడి నుండి వెళ్ళి పోయాడు. 

కాబట్టి ప్రజలు గమనించ వలసిందిగా కోరటమైనది   

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Saturday, July 5, 2014

తుమ్మి.... Excuse Me చెప్పనందుకు, యువతిని చితక బాదిన స్నేహితులు

న్యూస్ డెస్క్, హైదరాబాదు :

తుమ్మి.... "Excuse Me" అని చెప్పనందుకు, ఒక యువతిని తన స్నేహితులే చితక బాదిన సంఘటన తొందరగా వెలుగులోకి వచ్చింది. సోది లేకుండా వివరాలలోకి వెళ్తే....

గత శనివారం, ఒక ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, తన స్నేహితులతో కలిసి, అమీర్ పేటలోని ఒక రెస్టారెంటుకి వెళ్ళింది. అందరితో కలిసి పాచి బట్టిన పరాఠాలు తింటున్నది.  తన స్నేహితులతో, గత రాత్రి తాను చూసిన, హిందీ సీరియల్ గురించి, అందులో హీరోయిన్ లు వేసుకున్న చీరలు, జాకెట్ల గురించి, చెంబంత నోరుతో చెప్తుండగా, చాటంత చెవులతో అందరూ వింటున్నారు.

ఇంతలో....కబుర్లు చెబుతున్న అమ్మాయికి తుమ్ము రావటంతో తుమ్మింది. ఆ తుమ్ముకు అక్కడ చిన్న జల్లు కురసింది. ఆ కంగారులో ఆ అమ్మాయి, "Excuse Me" అని చెప్పటం మర్చిపోయింది. దానితో తన స్నేహితులు అందరూ కలిసి, ఆ అమ్మాయిని చితక బాదారు. మొదట తను తుమ్మినందుకు స్నేహితులు తంతున్నారేమో అనుకున్నది. కానీ నిజం తెలిసి బాధపడింది. తాను "Excuse Me" అన్నానని. కానీ ఆ హడావుడిలో ఎవరూ వినిపించుకోలేదని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. ఇదంతా చూస్తున్న కొంతమంది హుటాహుటిన ఆ అమ్మాయిని, స్నేహితుల బారి నుండి ప్రాణాలతో రక్షించారు.



ఆ అమ్మాయి స్నేహితురాలిని సంప్రదించగా....

అమ్మాయి :  "తుమ్మినప్పుడు, "Excuse Me" అనటం కనీసం మర్యాద.
విలేఖరి : అలా అనకపోతే ఏమి అవుతుంది మేడం, కూర్చొని కడుక్కొక పొతే తప్పు గానీ.... 
అమ్మాయి : తప్పా, తప్పున్నర... మ్యానర్ లెస్ గాల్ 
విలేఖరి : తుమ్ము చెప్పి రాదు కదా!!! ఒక వేళ "Excuse Me" అని అడిగాక, మీరు తుమ్మద్దు అన్నంత మాత్రాన, తుమ్ము ఆపుకోలేరు కదా. ఇంక "Excuse Me" అని అడగటం ఎందుకు? "Excuse Me" అనే లోపు ప్రాణం పోతే..
అమ్మాయి: ఇలాంటి వాళ్ళు ఉండటం కన్నా పోవటమే నయం, అని ముఖం చిట్లిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Friday, July 4, 2014

సచిన్ తెలియదన్నందుకు తన్నులు తిన్న కుర్రాడు

న్యూస్ డెస్క్, హైదరాబాద్:

క్రికెట్ దేవుడు, "బారత రత్న శ్రీ సచిన్ తెండూల్కర్" అంటే ఎవరో తనకు తెలియదన్నందుకు, ఒక కుర్రాడు తన్నులు తిన్న వైనం, అమీర్ పేట్ లో వెలుగు చూసింది. 

వివరాలలోకి వెళ్తే.... 

'కృష్ణ తేజ' అనే కుర్రాడు, బి.టెక్ అయిపోయి, అమీర్ పేట్ లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. నిన్న సాయంత్రం తన ఫేస్ బుక్ లో, "షరపోవాకే కాదు, నాకు కూడా సచిన్ తెండూల్కర్ అంటే ఎవరో తెలియదు" అని పోస్టు చేశాడు. అర్ధరాత్రి దాటాక, హాస్టల్ గది తలుపు తట్టినట్టు అనిపించటంతో, నిద్ర మత్తులో తలుపు తీశాడు. అంతే, అమాంతం పది మంది కుర్రాళ్ళు కలిసి, కృష్ణ తేజను చితక బాదారు. వాళ్ళు తంతునప్పుడు భాదతో "దేవుడా దేవుడా" అని అరిచాడు. "ఆ దేవుడే, ఎవరో తెలియదు అంటావా" అని ఇంకో నాలుగు దెబ్బలు తగిలించి వెళ్ళిపోయారు. దానితో కృష్ణ తేజను దగ్గర లోని హాస్పిటల్ లో చేర్చారు. 



నీకు నిజంగానే సచిన్ తెండూల్కర్ తెలియదా అని కృష్ణ తేజను మన 'అంతా ఉత్తదే' ప్రతినిధి అడుగగా, "నాకు సచిన్ తెండూల్కర్ తెలియక పోవటం ఏంటి? ఆ దేవుడికి ఉన్న కోట్లాది మంది భక్తులలో నేను కూడా ఒక్కడిని. నా కంప్యూటర్ , సెల్ ఫోను వాల్ మీద కూడా, సచిన్ బొమ్మే ఉంటుంది" అని భాదను దిగమింగుకుంటూ చెప్పాడు. మరి ఫేస్ బుక్ లో అలా ఎందుకు పెట్టావు అని ప్రశ్నించగా, "షరపోవాకు చూడండి, ఎంత పాపులారిటీ వచ్చిందో. నాకు కూడా షరపోవా ఎవరో తెలియదు. రెండు రోజుల నుండి ఎక్కడ చూసినా ఆమె పేరే. నాకు కూడా అంత పాపులారిటీ రావాలని ఇలా చేశాను. కానీ ఇలా తన్నులు తింటాను అని అనుకోలేదు. దేవుడు దయ వల్ల ప్రాణాలతో బయట పడ్డాను. ఇంకెప్పుడు దేవుడి మీద జోకులు వేయను" అంటూ బోరున విలపించటం, అక్కడి నర్సులను సైతం కలచి వేసింది. 

ఇంతకీ కృష్ణ తేజను  తన్నిన వాళ్ళ గురించి పోలీసులు దర్యాప్తు చేయగా, అతని ప్రాణ స్నేహితులు, అతని రూమ్ మేట్స్ కలిసే కృష్ణ తేజను తన్నారని తేలింది. వాళ్ళని సంప్రదించగా, "దేవుడు తెలియదు అన్నాడు, అందుకే దయ్యం వదిలే లాగా తన్నాము" అని సమర్ధించుకున్నారు. 

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Tuesday, July 1, 2014

కరెంటు ఇచ్చినందుకు రాస్తారోకో, కరెంటు ఆఫీసు ముట్టడి

న్యూస్ డెస్క్, ఒక పల్లెటూరు :

గుంటూరు జిల్లా లోని ఒక పల్లెటూరిలో, కరెంటు ఇచ్చినందుకు, ఆ గ్రామ ప్రజలు రాస్తారోకో చేశారు. రోడ్డు మీద బైఠాయించి, రహదారి పై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు చెదర గొట్టటంతో, ఆ తర్వాత కరెంటు ఆఫీసుని ముట్టడి చేశారు. ఈ హఠాత్తు పరిణామానికి కరెంటు ఉద్యోగులంతా విస్తు పోయారు.


వివరాలలోకి వెళ్తే....

గుంటూరు జిల్లా లోని ఒక పల్లెటూరిలో కరెంట్ ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. జనాలు కరెంటు సంగతి మర్చి పోయి, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటం, చిన్న పిల్లలు కరెంటు స్తంభాల చుట్టూ ఆడుకోవటం వంటివి చేస్తున్నారు. ఒక్కసారిగా ఊరికి విద్యుత్ పునరుద్ధరించటంతో, జనల కోపం కట్టలు తెంచుకుంది. దానితో రాస్తారోకో చేసారు. రోడ్డు మీద బైఠాయించి, రహదారి పై వాహనాలను అడ్డుకున్నారు.

ఆ ఊరు సర్పంచ్ గారు మీడియాతో మాట్లాడుతూ....

"మేము కరెంటు లేకుండా ఎలా ఉండాలో అలవాటు పడి, సుఖంగా ఉన్నాము. అలాంటిది మాకు మళ్ళీ కరెంటు ఇచ్చి, మా పల్లెటూర్లని ప్రభుత్వం నాశనం చేస్తున్నది. ఊర్లో సెల్ ఫోనులు, కంప్యూటర్ లు, టి. వి లు లేకపోవటంతో అంతా హాయిగా ఉన్నాము. పిల్లకాయలు చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కరెంటు ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు. అందుకే మేము ఆందోళన చేస్తున్నాము" అని చెప్పటం జరిగింది.

అధికారులను సంప్రదించగా, వారు ఈ విధంగా స్పందించారు..... 

ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాము. చట్టం లానే, మా పని మేము చేశాము. కరెంటు ఇవ్వటం మా విధి. ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని చేసినా, మేము కరెంటు ఇవ్వటం ఆపే ప్రశక్తే లేదు. అవసరం అయినప్పుడు తప్ప, మిగితా అన్ని సమయాల్లో మేము విద్యుత్ సరఫరా చేస్తాము, చేసి తీరుతాము" అని చెప్పారు/

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Wednesday, June 25, 2014

సార్వభౌమాధికారం అని సరిగ్గా పలికడంతో, M.L.A అయిన వార్డ్ మెంబర్

న్యూస్ డెస్క్ , హైదరాబాద్ :

"సార్వభౌమాధికారం" అని సరిగ్గా పలకడంతో, M.L.A గా వార్డ్ మెంబర్ కి అవకాశం వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో, పాపారావు అనే వార్డ్ మెంబర్, "సార్వభౌమాధికారం" అనే పదాన్ని సరిగ్గా పలకడంతో, అతన్ని M.L.Aగా నేరుగా అసెంబ్లీకి పంపాలని ఆ ఊరి ప్రజలు రాస్తా రోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 

ఆ ఊరి ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ 
"సార్వభౌమాధికారం" అని సరిగ్గా పలకటం అనేది సామాన్య విషయం కాదు. ఎంతో మంది M.L.A లు దానిని సరిగ్గా పలకలేక పోయారు. కాబట్టి M.L.A అయ్యే అర్హత మా పాపారావు గారికి ఖచ్చితంగా ఉంది. ఆయనను M.L.Aగా ప్రకటించే వరకు ఈ ఉద్యమం ఆగదు" అని స్పష్టం చేశారు. 

ఈ విషయం మీద పాపారావు గారు మాట్లాడుతూ 
"నేను చిన్నప్పటి నుండి M.L.A అయ్యి, అసెంబ్లీలో కూర్చోవాలని ఎన్నో కలలు కన్నాను. వారం రోజులపాటు తెలుగు మాష్టారు దగ్గరకు పోయి, కష్టపడి "సార్వభౌమాధికారం" అని పలకటం కూడా నేర్చుకున్నాను. నేను M.L.Aగా ఎందుకు అర్హుడిని కానో చెప్పాలి"  అని డిమాండ్ చేశారు. 

పై సంఘటనకు ఎలచన్ కమిసన్ దిగి వచ్చి, పాపారావు గారిని M.L.Aగా ప్రకటించింది. కానీ ఏ నియోజిక వర్గానికో మాత్రం వెల్లడించలేదు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది యువకులు పగలనకా, రాత్రనకా కష్టపడి "సార్వభౌమాధికారం" అనే పదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విధంగా అయినా తెలుగు పంతుళ్ళకు గిరాకీ పెరగటం ఆనందించాల్సిన విషయం. ఈ విషయాన్ని గమనించిన కార్పోరేట్ సంస్థ, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని, ఒక పుస్తకాన్ని అచ్చు వేయించారు. ఇందులో M.L.A లు వాడే అన్ని పదాలను ఉంచినట్టు చెప్పారు. బూతులకు ప్రత్యేకంగా పేజీలు  కేటాయించారు.


-------
కానీ నా ఉద్దేశ్యంలో, M.L.A కి ప్రజా సేవ చేయటం వస్తే చాలు. "సార్వభౌమాధికారం" పలికితే ఎంత, పలకక పొతే ఎంత. అక్షరం ముక్క చదువుకోక పోయినా, అవినితీ లేకుండా M.L.A గా చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు.

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Saturday, June 21, 2014

స్మార్ట్ ఫోను లేనందున సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అనుమతి నిరాకరణ

న్యూస్ డెస్క్, హైదరాబాద్ :

స్మార్ట్ ఫోను లేనందున సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అనుమతి నిరాకరించిన సంఘటన ఉదయం హైటెక్ సిటీలో వెలుగు చూసింది. హైటెక్ సిటీ లోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న సురేష్ అనే వ్యక్తికీ ఎదురైనా చేదు సంఘటన ఇది. రోజుటి లానే ఇవాళ కూడా ఆఫీసుకి వెళ్ళాడు. సెక్యురిటీ, ఐ. డి. కార్డు అడిగాడు. అది చూపించిన తర్వాత, సెల్ ఫోను తీసి చూపించమని అన్నాడు. సురేష్ ఒక పాత పాకియా ఫోను చూపించటంతో, సాఫ్ట్ వేర్ సభా హక్కుల ఉల్లంఘన క్రింద అతనికి అనుమతిని నిరాకరించారు. 





దీని పైన సెక్యూరిటీ జనాలని మన ప్రతినిధి సంప్రదించగా, ఇలా స్పందించాడు:

"కుక్క అన్నాక తోక, పక్షి అన్నాక రెక్క ఉండాలి. అలానే సాఫ్ట్ వేర్ అన్నాక స్మార్ట్ ఫోను ఉండాలి. మాకు పై నుండి ఉత్తర్వులు వచ్చాయి. ఎట్టి పరిస్థితులలో స్మార్ట్ ఫోను లేనిదే లోనికి అనుమతించం. ఐ. డి. కార్డు లేకపోయినా పర్వాలేదు కానీ స్మార్ట్ ఫోను మాత్రం ఉండి తీరాల్సిందే." అని తేల్చి చెప్పారు. 

ఈ విషయం మీద సురేష్ ను ప్రశ్నించగా, "స్మార్ట్ ఫోను లేకుండా రానివ్వరని నాకు కూడా తెలుసు. రాత్రి, నా నలభై వేల ఫోను నీళ్ళల్లో పడిపోయింది. బాగు చేయటానికి ఇస్తే, షాపు వాడు, అది బాగు అయ్యే దాక వాడుకోమని, తన దగ్గర ఉన్న పాత పాకియా ఫోను ఒకటి ఇచ్చాడు. నాకు సొంతంగా ఒక స్మార్ట్ ఫోను ఉందని చెప్పినా వీళ్ళు వినటం లేదని" ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS


Follow us on Facebook @ galiNEWS

Wednesday, June 18, 2014

ఇయర్ ఫోన్స్ లేక పోవటంతో ఊపిరాడక ఇంజినీరింగ్ యువతికి అస్వస్థత, పరిస్థితి విషమం

న్యూస్ డెస్క్, హైదరాబాద్ :

నగరంలోని జాలి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో,  అనూష అనే అమ్మాయి,  చెవిలో ఇయర్ ఫోన్స్ పోవటంతో ఊపిరాడక అస్వస్థతకు గురి అయ్యింది. పరిస్థితి విషమించటంతో దగ్గరిలోని హాస్పిటల్ కి చేర్చారు. 24 గంటలు దాటితే కానీ ఏ విషయం చెప్పలేమని అంటున్నారు. 

వివరాలలోకి వెళ్తే.... 

అనూష అనే యువతి, జాలి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్నది. రోజుటి లానే, ఉదయాన్నే కాలేజీకి బయలుదేరింది. బస్ స్టాప్ కి వచ్చే సరికి, తన ఇయర్ ఫోన్స్ మర్చిపోయినట్టు గుర్తించింది. సహాయం కోసం స్నేహితులను అడిగింది. ఎవ్వరి దగ్గరా అదనంగా ఇయర్ ఫోన్స్ లేకపోవటంతో కాసేపటికి ఊపిరి ఆడలేదు. పరిస్థితి విషమించేలా ఉందని గ్రహించిన స్నేహితులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్ లో చేర్చారు. 


ఇది సాదారణంగా, కాలేజీ పిల్లలో జరిగేదేనని, డాక్టర్ వైధ్యనాద్ జెఫ్ఫార్సీయస్ చెప్పారు. 24 గంటలు ఇయర్ ఫోన్సులో పాటలు వినే పిల్లలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివే పిల్లలు, ఒక్కోసారి ఇయర్ ఫోన్సు లేకపోవటంతో, ఏమి చేయలేక ఊపిరాడని పరిస్థితి వస్తుంది. ఇలాంటప్పుడు వెంటనే దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఏవైనా పెద్దగా వినిపించాలని. లేని పక్షంలో ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు. 

అనూష  స్నేహితులు కొందరిని విచారించగా, "మార్నింగ్ కూడా "ఆషికీ 2'' హిందీ పాటలు విన్నానని చెప్పిందని. ఇంతలో ఇలా జరుగుతుంది అని తాము ఊహించలేదని, సదరు అనూష చెలికత్తెలు విలపించటం as it is పలువురిని కలిచి వేసింది. 

ఈ సంఘటన చూస్తున్న 60 ఏళ్ళ పాపారావు గారిని మన గాలిన్యూస్ ప్రతినిధి సంప్రదించ కుండానే 
"వాయవ గాక పొతే, ఎప్పుడూ ఆ ఇయర్ ఫోన్సు చెవిలో ఎందుకుట ?? రోడ్డు దాటేప్పుడు, బస్సు ఎక్కి దిగేప్పుడు, ఆఖరికి అన్నం తినేప్పుడు కూడా ఇయర్ ఫోన్సు తీయరు" అని బ్లాగులో రాయలేని తిట్లు తిట్టారు. 

అనూష కాలేజీ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్ రాం బాబు గారు, సంఘటనా స్థలాన్ని చేరుకున్నప్పుడు, మన గాలిన్యూస్ ప్రతినిధి పలకరించగా, "ఒక సారి ఈ అమ్మాయి క్లాసులో ఇయర్ ఫోన్సు తీసి కూర్చున్నది. నేను గుర్తు పట్టలేక పోయాను. ఎవరో కొత్త అమ్మాయి అనుకున్నాను. తర్వాత నిజం తెలిసింది.  నా పాఠం విన్నదేమో అని భయమేసింది కూడాను" అన్నారు. "నిన్నెక్కడో చూసినట్టుంది " అని  మన గాలిన్యూస్ ప్రతినిధిని ప్రొఫెసర్ రాం బాబు గారు అడిగారు. "ఒకప్పుడు నేను మీ స్టూడెంట్ ను సార్, ఇప్పుడు పని పాట లేక గాలి వార్తలు అందిస్తున్నాను" అని చెప్పటంతో ఆనంద పడిపోయాడు. 

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS


Follow us on Facebook @ galiNEWS

Tuesday, June 17, 2014

FB లో లైకుల కోసం అమీర్ పేటలో ఫుట్ బాల్ కోచింగ్ సెంటరు

న్యూస్ డెస్క్ , అమీర్ పేట్:

ఫుట్ బాల్ ప్రపంచం కప్ అక్కడ ఎక్కడో జరుగుతున్నదీ అని మన అందరికీ తెలిసిన విషయం. తెలియక పోయినా నష్టం లేదనుకోండి. మన కుర్రాళ్ళకి క్రికెట్ గురించి అయితే బాగానే తెలుసు గానీ, ఫుట్ బాల్ గురించి అస్సలు తెలియదు. దీని వల్ల ఇప్పుడు జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ విశేషాలు అర్ధం కాక, వాటి గురించి FB లో పెట్టలేక పోతున్నారు. ఈ ఇబ్బందిని గమనించిన, Donkey Egg కోచింగ్ సెంటర్ వాళ్ళు, కేవలం ఫుట్ బాల్ కోసం రెండు రోజుల క్రాష్ కోర్సుని ప్రవేశ పెట్టారు. 



మన 'అంతా ఉత్తిదే ...' ప్రతినిధితో, Donkey Egg కోచింగ్ సెంటర్ ఫాకల్టీ ఒకరు ఈ విధంగా స్పందించారు 

"క్రికెట్ కన్నా, ఫుట్ బాల్ ఆట ప్రపంచంలో చాలా ఆదరణ పొందిన ఆటని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మన యువత ఎక్కువగా క్రికెట్ ఫాలో అవుతారు. దానితో  ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ రావటంతో, మన వాళ్ళకు  ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి. అందుకే మేము ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసాము. ఇక్కడ మొదటి రోజు ఉదయం, కాసేపు ఫుట్ బాల్ ఆట గురించి చెప్తాము. మధ్యాహ్నం పూట, ఆటలో గొప్ప గొప్ప ఆటగాళ్ళ గురించి చెబుతాము. రెండవ రోజు, ఇప్పుడు జరుగుతన్న ప్రపంచ కప్పులోని జట్ల గురించి చెప్తాము. ఆ రోజు మధ్యాహ్నం, వివిధ దేశాల్లో జనాలు FB లో ఏలాంటి స్టేటస్ లు పెడుతున్నారో విశ్లేషిస్తాము. ఫుట్ బాల్ గురించి నలుగురిలో ఉనప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? FB లో ఏ విధంగా కామెంట్లు పెట్టాలి అని కూడా నేర్పుతున్నాము, కేవలం 2000 రూపాయలకు మాత్రమే"

'అంతా ఉత్తిదే ...' ప్రతినిధి : మన వాళ్ళకు అర్ధం అవుతుంది అంటారా?
Donkey Egg కోచింగ్ సెంటర్ ఫాకల్టీ : తప్పదు. అర్ధం చేసుకోవాలి. ఒక స్టేటస్ కు లైకులు పెరగాలంటే ఇలాంటివి చేయక తప్పదు. 
అక్కడ ఉన్న కొంత మంది పిల్లలను 'అంతా ఉత్తిదే ...' ప్రతినిధి ప్రశ్నించగా, ఒక కుర్రాడు 
"ఆ ఆట ఏ ఏ దేశాలు ఆడతాయో కూడా తెలిసేది కాదు. facebook లో కొంత మంది స్నేహితులు "బ్రెజిల్" గెలుస్తుంది, కాదు "స్పెయిన్" గెలుస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటే, నాకు సిగ్గేసింది. ఒక స్నేహితుడు, " What A Match last night , Enjoyed A  Lot, Messi Rocks" అని పెట్టిన స్టేటస్ కి 100 లైకులు వచ్చాయి. నిజంగానే మేలుకొని చూశాడా అని తనని అడిగాను, "ఉదయం ఈనాడు పేపర్ చదివి స్టేటస్ పెట్టాను" అన్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది ఫుట్ బాల్ అంటే ఎంత క్రేజో. వెంటనే ఈ కోచింగ్ సెంటర్ లో నిన్న చేరాను. ఉదయం నేను పెట్టిన పోస్టుకి అప్పుడే లైకులు, కామెంట్లు ధారాళంగా వస్తున్నాయి. Thanks to Donkey Egg కోచింగ్ సెంటర్" అని కుర్రాడు చెప్పాడు. 

ఈ కోచింగ్ సెంటర్ లో చదివిన చాలా మంది కుర్రాళ్ళు, ఇప్పుడు గంటకు ఒకసారి ఫుట్ బాల్ మీద స్టేటస్ లు పెడుతున్నారు, లైకులు పెంచుకుంటున్నారు.

ఇట్లు....
బుల్లబ్బాయ్, ఎడిటర్,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Monday, June 16, 2014

Father's Day రోజు FB లో photo పెట్టలేదని, కొడుకుని గెంటేసిన తండ్రి

న్యూస్ డెస్క్ ,హైదరాబాదు :

Fathers day రోజున తన కొడుకు ఫేస్ బుక్ లో తనతో కలిసి దిగిన ఫొటో పెట్టలేదని, కొడుకుని ఇంట్లో నుంచి గెంటి వేసిన సంఘటన, కూకట్ పల్లిలో వెలుగు/ రాత్రి, రెండూ చూసింది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న జి.వినయ్ కుమార్, Father's Day రోజున తన తండ్రికి విషెస్ చెప్పలేదు సరి కదా, Facebook లో తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను పెట్టటం సైతం మర్చిపోయాడు. ఇది తెలిసిన తండ్రి, అవేశంతో, తన కొడుకుని ఇంట్లో నుండి బయటకు గెంటి వేసిన సంఘటన పలువురిని ఆశ్చర్య పరిచింది.



'అంతా ఉత్తిదే...' ప్రతినిధి, సదరు తండ్రిని ఈ విషయం మీద ప్రశ్నించగా,

"వాడికి నేను ఏ లోటూ రానివ్వలేదు. అల్లారు ముద్దుగా పెంచాను. ఇంటరు తప్పినా, లక్షలు పోసి ఇంజనీరింగ్ లో చేర్చాను. అలాంటిది, నాకు ఇంత ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. వాడికి ప్రతి నెల, నేనే ఇంటర్నెట్ బిల్ల్ కడుతున్నాను. వాడు అమ్మాయినేంటి, ఇంకో 'అబ్బాయిని ప్రేమించాను నాన్న' అన్నా కూడా నేను బాధ పడే వాడిని కాను. ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఇలాంటి కొడుకు పుట్టాడు." అంటూ వినయ్ తండ్రి విలపిస్తూ చెప్పటం, అక్కడ ఉన్న వారందరినీ కలిచి వేసింది.

'అంతా ఉత్తిదే...' ప్రతినిధి, వినయ్ ని ప్రశ్నించగా,

"నేను చేసినది పెద్ద నేరమే, దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్దం. నేను ఫొటో పెట్టి ఉండాల్సింది. పోయిన Mother's Day కి, మా అమ్మతో ఫొటో దిగి పెట్టినప్పుడు, యాభై లైకులు, పది కామెంట్లు వచ్చాయి. నా జీవితంలో ఎన్ని ప్రొఫైల్ పిక్స్ మార్చినా ఇన్ని లైకులు రాలేదు. మా నాన్న ఫొటో పెట్టుంటే ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ లైకులు వచ్చి ఉండేవి. మా నాన్నకు సారీ చెబుతూ ఫేస్ బుక్ లో ఇంకో పోస్టు పెట్టి, నాన్నను ట్యాగ్ చేస్తాను. అప్పటికైనా ఆయన మనస్సు కరుగుతుందేమో..." అంటూ బోరున విలపించాడు.

ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం, ఇలాంటి గొడవలు ఇంకో నాలుగు జరిగాయని తెలుస్తున్నది.

ఇట్లు....
బుల్లబ్బాయ్, ఎడిటర్,
గాలిNEWS

                                           Follow us on Facebook @ galiNEWS