Tuesday, July 1, 2014

కరెంటు ఇచ్చినందుకు రాస్తారోకో, కరెంటు ఆఫీసు ముట్టడి

న్యూస్ డెస్క్, ఒక పల్లెటూరు :

గుంటూరు జిల్లా లోని ఒక పల్లెటూరిలో, కరెంటు ఇచ్చినందుకు, ఆ గ్రామ ప్రజలు రాస్తారోకో చేశారు. రోడ్డు మీద బైఠాయించి, రహదారి పై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు చెదర గొట్టటంతో, ఆ తర్వాత కరెంటు ఆఫీసుని ముట్టడి చేశారు. ఈ హఠాత్తు పరిణామానికి కరెంటు ఉద్యోగులంతా విస్తు పోయారు.


వివరాలలోకి వెళ్తే....

గుంటూరు జిల్లా లోని ఒక పల్లెటూరిలో కరెంట్ ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. జనాలు కరెంటు సంగతి మర్చి పోయి, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటం, చిన్న పిల్లలు కరెంటు స్తంభాల చుట్టూ ఆడుకోవటం వంటివి చేస్తున్నారు. ఒక్కసారిగా ఊరికి విద్యుత్ పునరుద్ధరించటంతో, జనల కోపం కట్టలు తెంచుకుంది. దానితో రాస్తారోకో చేసారు. రోడ్డు మీద బైఠాయించి, రహదారి పై వాహనాలను అడ్డుకున్నారు.

ఆ ఊరు సర్పంచ్ గారు మీడియాతో మాట్లాడుతూ....

"మేము కరెంటు లేకుండా ఎలా ఉండాలో అలవాటు పడి, సుఖంగా ఉన్నాము. అలాంటిది మాకు మళ్ళీ కరెంటు ఇచ్చి, మా పల్లెటూర్లని ప్రభుత్వం నాశనం చేస్తున్నది. ఊర్లో సెల్ ఫోనులు, కంప్యూటర్ లు, టి. వి లు లేకపోవటంతో అంతా హాయిగా ఉన్నాము. పిల్లకాయలు చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కరెంటు ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు. అందుకే మేము ఆందోళన చేస్తున్నాము" అని చెప్పటం జరిగింది.

అధికారులను సంప్రదించగా, వారు ఈ విధంగా స్పందించారు..... 

ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాము. చట్టం లానే, మా పని మేము చేశాము. కరెంటు ఇవ్వటం మా విధి. ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని చేసినా, మేము కరెంటు ఇవ్వటం ఆపే ప్రశక్తే లేదు. అవసరం అయినప్పుడు తప్ప, మిగితా అన్ని సమయాల్లో మేము విద్యుత్ సరఫరా చేస్తాము, చేసి తీరుతాము" అని చెప్పారు/

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

1 comment: