Friday, July 25, 2014

ముఖాన స్కార్ఫ్ లేకుండా బండి ఎక్కినందుకు అమ్మాయికి జరిమానా

న్యూస్ డెస్క్, హైదరాబాద్ :

ముఖాన స్కార్ఫ్ లేకుండా బండి ఎక్కినందుకు, ఒక అమ్మాయికి 5000 జరిమానా వేసిన సంగతి హైదరాబాదులో చోటు చేసుకుంది. మాదాపూర్ లోని ఒక ఐటి కంపెనీలో పని చేస్తున్న దీపక్, తన స్నేహితురాలు సరోజతో కలిసి, బంజారా హిల్స్ లోని సినీ మాక్స్  సినిమా థియేటర్ లో "సగం కాలిన శవం" అనే దయ్యం సినిమాకి వెళ్ళాలని బయలు దేరాడు.  

మాదాపూర్ నుండి వస్తూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు దాటగానే, పోలీసులు వాహనాలన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. దీపక్ ను సైతం ఆపారు. 


దీపక్ తన బండిని పక్కకు ఆపి, హెల్మెట్ తీసి, తన జేబులో ఉన్న బండి సి బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ అన్నీ తీసి పోలీసు చేతికి అందించాడు. ట్రాఫిక్ కానిష్టేబుల్ వాటిని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాడు. 5000 రూపాయలు జరిమానా విదిస్తూ చలానా రాసి దీపక్ చేతికి ఇచ్చాడు. ఖంగు తిన్న దీపక్ తేరుకొని, "నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, హెల్మెట్ తో సహా,  5000 రూపాయలు ఎందుకు" అని ప్రశ్నించాడు. దీపక్ వెనుక కూర్చున్న సరోజ ముఖాన స్కార్ఫ్ లేనందుకు ఆ 5000 జరిమానా విదిస్తున్నట్టు తెలియజేశాడు. చేసేది లేక 5000 కట్టి అక్కడి నుండి వెళ్ళి పోయాడు. 

కాబట్టి ప్రజలు గమనించ వలసిందిగా కోరటమైనది   

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Saturday, July 5, 2014

తుమ్మి.... Excuse Me చెప్పనందుకు, యువతిని చితక బాదిన స్నేహితులు

న్యూస్ డెస్క్, హైదరాబాదు :

తుమ్మి.... "Excuse Me" అని చెప్పనందుకు, ఒక యువతిని తన స్నేహితులే చితక బాదిన సంఘటన తొందరగా వెలుగులోకి వచ్చింది. సోది లేకుండా వివరాలలోకి వెళ్తే....

గత శనివారం, ఒక ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, తన స్నేహితులతో కలిసి, అమీర్ పేటలోని ఒక రెస్టారెంటుకి వెళ్ళింది. అందరితో కలిసి పాచి బట్టిన పరాఠాలు తింటున్నది.  తన స్నేహితులతో, గత రాత్రి తాను చూసిన, హిందీ సీరియల్ గురించి, అందులో హీరోయిన్ లు వేసుకున్న చీరలు, జాకెట్ల గురించి, చెంబంత నోరుతో చెప్తుండగా, చాటంత చెవులతో అందరూ వింటున్నారు.

ఇంతలో....కబుర్లు చెబుతున్న అమ్మాయికి తుమ్ము రావటంతో తుమ్మింది. ఆ తుమ్ముకు అక్కడ చిన్న జల్లు కురసింది. ఆ కంగారులో ఆ అమ్మాయి, "Excuse Me" అని చెప్పటం మర్చిపోయింది. దానితో తన స్నేహితులు అందరూ కలిసి, ఆ అమ్మాయిని చితక బాదారు. మొదట తను తుమ్మినందుకు స్నేహితులు తంతున్నారేమో అనుకున్నది. కానీ నిజం తెలిసి బాధపడింది. తాను "Excuse Me" అన్నానని. కానీ ఆ హడావుడిలో ఎవరూ వినిపించుకోలేదని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. ఇదంతా చూస్తున్న కొంతమంది హుటాహుటిన ఆ అమ్మాయిని, స్నేహితుల బారి నుండి ప్రాణాలతో రక్షించారు.



ఆ అమ్మాయి స్నేహితురాలిని సంప్రదించగా....

అమ్మాయి :  "తుమ్మినప్పుడు, "Excuse Me" అనటం కనీసం మర్యాద.
విలేఖరి : అలా అనకపోతే ఏమి అవుతుంది మేడం, కూర్చొని కడుక్కొక పొతే తప్పు గానీ.... 
అమ్మాయి : తప్పా, తప్పున్నర... మ్యానర్ లెస్ గాల్ 
విలేఖరి : తుమ్ము చెప్పి రాదు కదా!!! ఒక వేళ "Excuse Me" అని అడిగాక, మీరు తుమ్మద్దు అన్నంత మాత్రాన, తుమ్ము ఆపుకోలేరు కదా. ఇంక "Excuse Me" అని అడగటం ఎందుకు? "Excuse Me" అనే లోపు ప్రాణం పోతే..
అమ్మాయి: ఇలాంటి వాళ్ళు ఉండటం కన్నా పోవటమే నయం, అని ముఖం చిట్లిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Friday, July 4, 2014

సచిన్ తెలియదన్నందుకు తన్నులు తిన్న కుర్రాడు

న్యూస్ డెస్క్, హైదరాబాద్:

క్రికెట్ దేవుడు, "బారత రత్న శ్రీ సచిన్ తెండూల్కర్" అంటే ఎవరో తనకు తెలియదన్నందుకు, ఒక కుర్రాడు తన్నులు తిన్న వైనం, అమీర్ పేట్ లో వెలుగు చూసింది. 

వివరాలలోకి వెళ్తే.... 

'కృష్ణ తేజ' అనే కుర్రాడు, బి.టెక్ అయిపోయి, అమీర్ పేట్ లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. నిన్న సాయంత్రం తన ఫేస్ బుక్ లో, "షరపోవాకే కాదు, నాకు కూడా సచిన్ తెండూల్కర్ అంటే ఎవరో తెలియదు" అని పోస్టు చేశాడు. అర్ధరాత్రి దాటాక, హాస్టల్ గది తలుపు తట్టినట్టు అనిపించటంతో, నిద్ర మత్తులో తలుపు తీశాడు. అంతే, అమాంతం పది మంది కుర్రాళ్ళు కలిసి, కృష్ణ తేజను చితక బాదారు. వాళ్ళు తంతునప్పుడు భాదతో "దేవుడా దేవుడా" అని అరిచాడు. "ఆ దేవుడే, ఎవరో తెలియదు అంటావా" అని ఇంకో నాలుగు దెబ్బలు తగిలించి వెళ్ళిపోయారు. దానితో కృష్ణ తేజను దగ్గర లోని హాస్పిటల్ లో చేర్చారు. 



నీకు నిజంగానే సచిన్ తెండూల్కర్ తెలియదా అని కృష్ణ తేజను మన 'అంతా ఉత్తదే' ప్రతినిధి అడుగగా, "నాకు సచిన్ తెండూల్కర్ తెలియక పోవటం ఏంటి? ఆ దేవుడికి ఉన్న కోట్లాది మంది భక్తులలో నేను కూడా ఒక్కడిని. నా కంప్యూటర్ , సెల్ ఫోను వాల్ మీద కూడా, సచిన్ బొమ్మే ఉంటుంది" అని భాదను దిగమింగుకుంటూ చెప్పాడు. మరి ఫేస్ బుక్ లో అలా ఎందుకు పెట్టావు అని ప్రశ్నించగా, "షరపోవాకు చూడండి, ఎంత పాపులారిటీ వచ్చిందో. నాకు కూడా షరపోవా ఎవరో తెలియదు. రెండు రోజుల నుండి ఎక్కడ చూసినా ఆమె పేరే. నాకు కూడా అంత పాపులారిటీ రావాలని ఇలా చేశాను. కానీ ఇలా తన్నులు తింటాను అని అనుకోలేదు. దేవుడు దయ వల్ల ప్రాణాలతో బయట పడ్డాను. ఇంకెప్పుడు దేవుడి మీద జోకులు వేయను" అంటూ బోరున విలపించటం, అక్కడి నర్సులను సైతం కలచి వేసింది. 

ఇంతకీ కృష్ణ తేజను  తన్నిన వాళ్ళ గురించి పోలీసులు దర్యాప్తు చేయగా, అతని ప్రాణ స్నేహితులు, అతని రూమ్ మేట్స్ కలిసే కృష్ణ తేజను తన్నారని తేలింది. వాళ్ళని సంప్రదించగా, "దేవుడు తెలియదు అన్నాడు, అందుకే దయ్యం వదిలే లాగా తన్నాము" అని సమర్ధించుకున్నారు. 

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

Tuesday, July 1, 2014

కరెంటు ఇచ్చినందుకు రాస్తారోకో, కరెంటు ఆఫీసు ముట్టడి

న్యూస్ డెస్క్, ఒక పల్లెటూరు :

గుంటూరు జిల్లా లోని ఒక పల్లెటూరిలో, కరెంటు ఇచ్చినందుకు, ఆ గ్రామ ప్రజలు రాస్తారోకో చేశారు. రోడ్డు మీద బైఠాయించి, రహదారి పై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు చెదర గొట్టటంతో, ఆ తర్వాత కరెంటు ఆఫీసుని ముట్టడి చేశారు. ఈ హఠాత్తు పరిణామానికి కరెంటు ఉద్యోగులంతా విస్తు పోయారు.


వివరాలలోకి వెళ్తే....

గుంటూరు జిల్లా లోని ఒక పల్లెటూరిలో కరెంట్ ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. జనాలు కరెంటు సంగతి మర్చి పోయి, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటం, చిన్న పిల్లలు కరెంటు స్తంభాల చుట్టూ ఆడుకోవటం వంటివి చేస్తున్నారు. ఒక్కసారిగా ఊరికి విద్యుత్ పునరుద్ధరించటంతో, జనల కోపం కట్టలు తెంచుకుంది. దానితో రాస్తారోకో చేసారు. రోడ్డు మీద బైఠాయించి, రహదారి పై వాహనాలను అడ్డుకున్నారు.

ఆ ఊరు సర్పంచ్ గారు మీడియాతో మాట్లాడుతూ....

"మేము కరెంటు లేకుండా ఎలా ఉండాలో అలవాటు పడి, సుఖంగా ఉన్నాము. అలాంటిది మాకు మళ్ళీ కరెంటు ఇచ్చి, మా పల్లెటూర్లని ప్రభుత్వం నాశనం చేస్తున్నది. ఊర్లో సెల్ ఫోనులు, కంప్యూటర్ లు, టి. వి లు లేకపోవటంతో అంతా హాయిగా ఉన్నాము. పిల్లకాయలు చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కరెంటు ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు. అందుకే మేము ఆందోళన చేస్తున్నాము" అని చెప్పటం జరిగింది.

అధికారులను సంప్రదించగా, వారు ఈ విధంగా స్పందించారు..... 

ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాము. చట్టం లానే, మా పని మేము చేశాము. కరెంటు ఇవ్వటం మా విధి. ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని చేసినా, మేము కరెంటు ఇవ్వటం ఆపే ప్రశక్తే లేదు. అవసరం అయినప్పుడు తప్ప, మిగితా అన్ని సమయాల్లో మేము విద్యుత్ సరఫరా చేస్తాము, చేసి తీరుతాము" అని చెప్పారు/

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS